VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : చిలకలూరిపేట:నకిలీ సిగరెట్ల విక్రయదుకాణాలపై విజిలెన్స్ అధికారులు శనివారం మెరుపుదాడులు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో సీఐ శ్రీహరిరావు, ఎస్‌ఐ రామచంద్రయ్య ఉన్నారు. పట్టణంలోని చలివేంద్ర బజార్, కోమలావిలాస్ బజార్లలోని పలు దుకాణాల్లో విజిలెన్స్‌బృందాలు తనిఖీలు నిర్వహించారు. బాలసుజాత జనరల్ స్టోర్స్, చికోటి ఎంటర్ ప్రైజేస్, సాయి ట్రేడర్స్‌లలో విదేశీ సిగరెట్లతో పాటు నకిలీబ్రాండ్ల సిగరెట్లను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం 40 బండిల్స్ ఉన్న నకిలీ సిగరెట్లను స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్లలో ఐటీసీ బ్రాండ్ల పోలిన సిగరెట్లు ఉండటం విశేషం. మూడు దుకాణాల యజమానులతో పాటు వాటిని సరఫరా చేసిన వరగాని ప్రాంతానికి చెందిన సుధకర్‌పై కూడా అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె ఈశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో నకిలీ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఐటీసీ ట్రేడ్‌మార్కుతో ఇండియా అంతటా విక్రయించే బ్రాండెడ్ సిగరెట్లను ఫేక్ ట్రేడ్ మార్కులను ముద్రించి విక్రయిన్నట్లు తెలిపారు.
ఒరిజనల్, నకిలీలపై కలిపి ఐటీసీ ఫేక్ ట్రేడ్‌ను ఉండటాన్ని గుర్తించి దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో పట్టుబడిన సిగరెట్లపై కూడా ఇవి ఉన్నాయన్నారు. క్వాలిటీ టాక్స్ చెల్లించి ఒక్కొక్క సిగరెట్ ధర రూ.15 చొప్పున విక్రయించాల్సి ఉండగా, ఇక్కడి వారు నకిలీ సిగరెట్లు తయారు చేసి రూ.1 లేదా రూ.1.25 కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. నాసిరకం సిగరెట్లు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మూడు దుకాణాల్లో సుమారు రూ.7 లక్షల సిగరెట్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని సరఫరా చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తికి గుట్కా కేసుల్లోనూ సంబంధాలు ఉన్నాయన్నారు. నకిలీ ఉత్పత్తుల్ని ప్రజలకు ఉపయోగించవద్దని, ఎక్కడైనా విక్రయాలు గమనించినట్లైతే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సిగరెట్లు విక్రయిస్తున్న వారి మీద కేసులు కడుతున్నామని తెలియజేశారు. వారితో పాటు రెవెన్యూ ఆర్‌ఐ విడదల రామనాయుడు, సిబ్బంది ఉన్నారు.
Admin
VM టుడే న్యూస్