VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : నారా లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిస్తే వైకాపాకు ఎందుకు భయం పట్టుకుందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై దృష్టి మళ్లించేందుకే జగన్ మళ్లీ విశాఖ రాజధాని డ్రామాను తెరపైకి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన విస్పష్ట తీర్పుని కూడా అపహాస్యం చేసేలా జగన్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై ఈ చర్యలన్నీ కోర్టుధిక్కరణ కిందకే వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం నాదెండ్ల మండలం కనపర్రులో 'బాబుతో నేను' కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తదితర నాయకులతో కలిసి ప్రత్తిపాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి చంద్రబాబు అక్రమ అరెస్టు, కక్ష సాధింపు చర్యల గురించి ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అరాచక పాలన పోవాలి.. చంద్రన్న పాలన రావాలంటూ నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రత్తిపాటి, మన్నవ సుబ్బారావు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ అక్రమమని, ఆయనకు న్యాయం జరిగే వరకు ప్రజలు అండగా నిలవాలని ప్రత్తిపాటి కోరారు. ప్రతి గ్రామంలో చంద్రబాబుపై సానుభూతి పెరిగి తెదేపాకు ఆదరణ పెరిగిందన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి తలకిందులైందని ప్రత్తిపాటి ఆరోపించారు. కేంద్ర హోమంత్రి అమిత్‌షాతో లోకేశ్ భేటీ అనుకోకుండా జరిగిందేనని.. ఊహాగానాలు, వాస్తవాలు ఎప్పుడు వేరుగానే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముఖ్య రాజకీయ నాయకుల్ని అందర్నీ లోకేశ్ కలుస్తునే ఉన్నారని
అందులో భాగంగానే అమిత్ షా ఆహ్వానం మేరకే బుధవారం రాత్రి భేటీ జరిగిందని ప్రత్తిపాటి తెలిపారు. ఈ కీలక భేటీలో లోకేశ్ జగన్ అరాచకాలపై కేంద్రహోంమంత్రికి అన్నీ వివరించారని... అంతకు మించి రాజకీయాలు, పొత్తులు వంటి అంశాలు ఏవీ చర్చకు రాలేదన్నారు. జాతీయస్థాయిలో ఎన్డీఏ, ఇండియా రెండు కూటములకు తెలుగుదేశం సమదూరం పాటిస్తుందని స్పష్టం చేశారు. అరాచక పాలన సాగిస్తున్న వైకాపా పాలనకు చరమగీతం పాడాలని మన్నవ సుబ్బారావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మాజీ మార్కేట్ యార్డ్ చైర్మన్ తెళ్ళా సుబ్బారావు , నాదేండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ మల్లవరపు జయప్రసాద్ , గ్రామ అధ్యక్షులు అంతయ్య మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
VM టుడే న్యూస్