VM Today News - వార్తలు / పల్నాడు : కార్మిక హక్కులను, చట్టాలను హరిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు కార్మిక సంఘాల నాయకులు పిడుగురాళ్ల సున్నపు బట్టీల సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లైమ్ స్టోన్ సిటీగా పేరుగాంచిన పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల సున్నపు పరిశ్రమల నుండి నిత్యం కొన్ని వందల టన్నుల సున్నం దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు ,పేపర్ మిల్లులకు, చేపల ఎరువు ,బ్రిక్ తయారీ కంపెనీలకు, ఎగుమతి చేయబడుతుంది. అలాంటి పేరుగాంచిన సున్నపు పరిశ్రమలో నిత్యం సున్నం తయారీలో రాత్రిం భవళ్ళు వెట్టి చాకిరికి గురవుతూ ప్రమాదపు అంచుల్లో జీవనం కొనసాగిస్తున్నారు కార్మికులకు యాజమాన్యాలు ఎటువంటి రక్షణ చర్యలను, భద్రతను, మౌలిక వసతులను కల్పించకుండా వారిని మృత్యు కుహరం లోనికి నెడుతున్నారు. సున్నపు బట్టీల కార్మికులు ఏళ్ల తరబడి ఎటువంటి గుర్తింపు లేకుండా సున్నపు తయారీకి అవసరమైనటువంటి రాయి,బొగ్గు కొడుతూ రెక్కల ముక్కలు చేసుకున్నా కనీసం మూడు పూటలా తిండికి కూడా సరిపోవడంలేదని కార్మికులు వాపోతున్నారు.బయట ఉపాధి లేక ఎటు పోలేక పూట గడుపుకోవడానికి యాజమాన్యం పెట్టే ఇబ్బందులకు గుండె రాయి చేసుకుని బతుకుతున్నారు మానవత్వం మరిచిన పెట్టుబడిదారులు బలవంతంగా 12 గంటలు వెట్టి చాకిరి చేయించుకొని కేవలం నెలకు 4000 జీతం ఇచ్చి కార్మికుల కష్టాన్ని అత్యంత దారుణంగా దోచుకుంటున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు మొద్దు కష్టం చేయించుకొని పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా కార్మికులను మోసం చేసి లాభాలు ఘడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల రాబోవు రోజుల్లో పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కార్మిక సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళతామన్నారు. అనంతరం ఎం సిపిఐ జిల్లా అధ్యక్షులు ఓర్సు కృష్ణ మాట్లాడుతూ కనీసం విధుల్లో ఉన్నప్పుడు కార్మికులు అవసరమైన దుస్తులు ,షూస్, కళ్ళజోళ్ళు, హెల్మెట్, కొబ్బరి నూనె, బెల్లం ,లాంటి సరుకులు కూడా యాజమాన్యం ఇవ్వడం లేదు అంటే సిగ్గుచేటు, సున్నపు బట్టీలపై సంబంధిత లేబర్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు తరచూ సున్నపు పరిశ్రమలు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను,రక్షణ చర్యలను,తనిఖీ చేస్తూ ఉండాలి కానీ అటువంటివి ఏమీ లేకుండా కార్మికులను మరింత బానిసలుగా మార్చి వారి హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు సేవ చేస్తున్నారు.ఇకనైనా సున్నపు పరిశ్రమ కార్మిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సాధించాలి, శ్రమ దోపిడీ బలవంతపు శ్రమను అరికట్టి వారికి అవసరమైన సేఫ్టీ పరికరాలు, పనికి తగిన జీతం, పిఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలి ,అలాగే పొల్యూషన్ నియంత్రణకై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు, సెంటర్ ట్రేడ్ యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
VMToday News