VM Today News - వార్తలు / : * న్యూ ఢిల్లీ : పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ప్రకటనల్లో వినియోగించిన భాష, వాటిలో ప్రస్తావించిన పేర్లు సముచితంగానే ఉన్నాయని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. ఇదే విషయాన్ని రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, పతంజలి సంస్థ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి తెలిపింది. అయితే, ఆ ప్రకటనల ప్రతుల డిజిటల్ ఫైలింగ్‌పై జస్టిస్ హిమా కోహ్లీ అభ్యంతరం తెలిపారు. అన్ని వార్తా పత్రికల్లో ప్రచురితమైన క్షమాపణ ప్రకటనల ఒరిజినల్ పేజీలను రికార్డు చేయాలని ఏప్రిల్ 23న తాము ఆదేశించామని స్పష్టం చేశారు. ధర్మాసనం ఆదేశాలను అర్థంచేసుకోవడంలో, వాటిని తమ సిబ్బందికి తెలియజేయడంలో పొరపాటు జరిగిందని పతంజలి తరఫు న్యాయవాది అంగీకరించారు. దీంతో ఈ కేసులో ‘చివరి అవకాశం’ కల్పిస్తున్నామని చెబుతూ క్షమాపణ ప్రకటనల ఒరిజినల్ పేజీలను రికార్డు చేసుకునేలా కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలిచ్చింది. విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపునివ్వాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. ఆ మినహాయింపు తదుపరి ఒక్క వాయిదాకు మాత్రమే పరిమితమని ధర్మాసనం స్పష్టంచేస్తూ అంగీకరించింది. ఇప్పటికి నిద్ర లేచారు..’ పతంజలి కేసు విచారణ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును నిలిపివేసిన విషయాన్ని రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ మంగళవారం ధర్మాసనానికి తెలిపింది. ‘‘ఏప్రిల్ 10న మేము ఇచ్చిన ఆదేశాల తర్వాతే ఉత్తరాఖండ్ అధికారులు నిద్ర నుంచి మేల్కొన్నట్లు కన్పిస్తోంది. ఆరేళ్ల నుంచి సంస్థపై మీరెందుకు చర్యలు తీసుకోలేదు? కోర్టు సానుభూతి, కరుణ కావాలంటే నిజాయతీగా ఉండండి’’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం మందలించింది. అయితే, ఈ చర్యలను చట్ట ప్రకారం తీసుకున్నారా? లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. 2018 నుంచి ఇప్పటి వరకు హరిద్వార్ జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారులుగా ఉన్న వారందరూ పది రోజుల్లోగా విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
Reporter
VMToday News